Saturday, March 10, 2007

"కన్న కడుపు"

"కన్న కడుపు"
కృత్తిక బోయి రోహిణి పెట్టింది. మిడసరంగా కాస్తండాయి యెండలు. రోళ్లు పగిలే యెండలు. మజ్జాణమైతే ఒక్కపిట్టు గూడా ఇళ్లళ్లోంచి బైటికి రావటంల్యా. యాణ్ణించో పరవాణ్ణం కాస్తున్న వాసనొస్తుంటే, పాపం మిట్ట మజ్జాణం యెండని గూడా లెక్కజైకుండా ఆ వాసన పడతా ఈదిలో దిక్కులు మక్కులు చూడకుండానే పోతావుందది. దాని కడుపు కుండున్నట్టుంది. అది కడుపుతో వుంది.అందుకనే బలే ఆశిగా బయిల్దేరింది పరవాణ్ణం కోసరం. అది నల్ల బట్ల కుక్క. సూడుతో వుంది. మణుసులకైతే నీళ్లు పోసుకున్నప్పుడు యేవేవో తినాలని, చుట్టాల్నో, గిట్టాల్నో చూడాలని ఉంటాదంట. లేకపోతే కానుపు టయానికి కాళ్లు జేతులు వాసిపొయ్యి, ఒక్కోక తడవ కానుపుగూడా కష్టమవతాదంట.

ఆ కుక్క ఆవోళ్లోనే పుట్టిన కాణ్ణుంచీ ఉంది. అదెప్పుడూ ఒకరి జోలికిపోయెరగదు. ఈది కుక్కలతో కాట్లాటలకి పోదు.దానిమానాన అది దిరికింది తింటం, పలక్కుండ పొయి ఏనీణ్ణో పొణుకోవటం.ఇంతే. పిలకాయిలు మట్టి గెడ్డలు ఇసరతారు. చెవులు బట్టుకొని, తోక బట్టుకోని లాగతారు. అదేవనదు. ఒక్కోసారి దాని మెడకాయని, మొకాన్నీ,ఈపునీ సవరదీస్తా దాంతో ఆడుకుంటారు. కుయ్ కుయ్ మంటా వోళ్లతో చెల్లాటాలాడతాది. కుక్కల్లో అది తప్పిపోయి పుట్టిందని ముసిలొళ్లు అంటావుంటే అది యిని మురిసిపోతావుంటాది

"మణిసికైతే కావాల్సినాయి యాడొకదిక్కణ్ణుంచి వస్తాయి. లేకపోతే ఎవురో ఒకరు తెచ్చిస్తారు. నేను మణిసిని గాకపోతిని నాకెవురు తెచ్చిస్తారు. అదిగావాల, ఇదిగావాలాలాని నాకుంటే మటుకు సరిపోద్దా. యెప్పుడు జేసుకున్న పాపవో ఇట్ట కుక్క బతుకయింది" అనుకుంటా నల్ల బట్ల కుక్క ఆ పరవాణ్ణం కాస్తున్న ఇంటికాడికి వాసనబట్టి వొచ్చేసింది.

ఆ యిళ్లు చిట్లెంకిది. ఆయెమ్మి పేరేందో చానా మందికి తెలవదు. మొగుడు దప్ప కొరవోళ్లందురూ చిట్లెంకనే అంటారు. అట్టంటే దానికి మణిసికొచ్చినట్టొస్తాది కోపం. దాని నోరు చిన్నదిగాదు. అందుకనే తెలిసినోళ్లెవురూ దాన్నోటికిబోరు. నోరిప్పిందంటె పాయిపతాళంగా పడతాది. అది గూడా కడుపుతోనే ఉంది. చుట్టు పక్కలోళు "దీనికెందుకమ్మా బిడ్డలా!" అని నోళ్లు నొక్కుకున్నారు.
నల్లబట్ల కుక్క ఆ ఇంటీకొచ్చేతలికే చిట్లెంకి పరవాణ్ణం దబరని పొయ్యిమింద నించి కిందకి దించింది. కుక్క బోయి తలాకిట్లోనే కూకుంది. చిట్లెంకి "చేవేడి ముండా! అప్పుడే వాసనబట్టేసినావు గద్యా! ఫో !అవతలి నడువు నాలంజా!" అని కుక్కని తరిమింది. పాపం అది ఉసుౠ మంటా ఇంటిముందర అంట్లు దోమే దాసాని చెట్టు కాడికి పొయింది. యెండన బడి వొచ్చేతలికే ఒకటే రొప్పుగా వుంది దానికి. అట్టనే రొప్పతా రోస్తా ఆడ కూలబడింది. ఇంటి సాయే జూస్తా వుంది. "ఈ మణిసి అంతా తిందు గదా! ఆకరాన అడుగూ బొడుగన్నా నామొకాన ఆల్చా కుండా పోద్దా" అని ఆడే కూసోనుంది. దీని యవ్వారం జూసి చిట్లెంకి దబరలో పరవాణాన్ని సుబ్బరంగా కడిగినట్టు నాకేసి, ఇంకేవన్నా వాసన గీసన ఉంటాదేవోనని, దబరకడిగి ఆ నీళ్లు గూడా యెత్తి నోట్లొ పోసుకోని దబరెత్తి బయిట పారేసింది.

దబరకాడికి పొయి చూసే తలికే నల్లకుక్కకి కడుపు మండిపొయింది. "ఓసి నాలంజాగదే! నియ్యాల నేంగూడా కడుపుతోనే ఉండాన్యా. ఒకాల దబరడు పరవాణ్ణం కాసుకున్నావుగదా! రోంత నామొకానెయ్యిగూడదా ! పానీ అంతా నీకడుపుకే చించుకున్నావనుకో,దబర గడిగిన అడుగులు బొడుగులైనా నాయాదాన గొట్టుంట్యా నా కడుపుగూడా సల్లారదంటే నాసవిత్యా! ఇంత గాతపుదానివి నీకుబిడ్డలెందుకే తొండేకోర్ నాయాలా! ఒకాల పుట్టినా గాని నీ సైక్కిరిం నువ్వు జూసుకుంటావు గాన్యా ఆ బిడ్డల మొకవైనా నువ్వు జూస్తా వంటే మాదర్చేదు నాయాలా! ఇంత గాతకానికి తెగిచ్చిన దాన్ని, పైనా దేవుడనేవోడుంటే సూడకపాతాడా! సూసి నాకడపన బిడ్డల్ని నీ కడపనా, నీకడపన బిడ్డల్ని నా కడపనా యెయ్యికపాతాడా" అనుకోని తిరిగిపొయింది కుక్క.

చిట్లెంకి కానుపుకి పుట్టింటికి పొయింది. నల్లకుక్కకీ, చిట్లెంకికి ఒకతూరే నెప్పులొచ్చినాయి.చిట్లెంకికి ఆరు కుక్కపిల్లలు పుట్టినాయి. తీసకపోయి ఊరవతపారేయించింది. పుట్టినబిడ్డ పురిట్లోనె పొయినాడని మొగొణ్ణీ, ఊరినీ నమ్మించింది.
నల్లకుక్క ఇద్దరు ఆడపిలకాయిల్ని కనింది. ఆబిడ్డల్ని చూసుకోని సంబరపడాలో, యాడవాలో దానికే తెలవలా. "ఓరి బగమంతుడా! బంగారంటి బిడ్డల్ని నాకడుపునేసినావు గదరా నాయినా! ఆయాల నేనేందో ఆకలిమిందా, కోపం మిందా వుండి ఒక్క మాటన్నాదానికి నిజింగానే నాకడుపులో ఇ నసిగందు బిడ్డల్నేసినావా తండ్రీ! నేను జూస్తే కుక్కనయిపోతిని, ఈళ్లు జూశ్తే ఆడబిడ్డలయిపాయ" అని పిలకాయిలసాయి జూసి,"సరేలే. దేవుడెట్టరాస్తే అట్ట జరగాల. ఒద్దూ గిద్దూ అనే దానికి నేనేబోటిదాన్నిలే. కడుపున కాసిన నసిగందు బిడల్ని కసువు దిబ్బల్లో పారెయ్ టానికి నేను మణిసిని గూడా గాకపోతిని. యెవురికి యెట్ట రాసుంటే అట్ట జరగాల. ఈ బిడ్డలు నాకడుపున బడాలని ఉందేమో. అట్టనే గానీ. నేందినే ముద్దే ఈళ్లకి తెచ్చి పెడతా. నా వొంట్లో పాణం ఉణ్ణెన్ని దినాలూ సాకతా అవతల రెక్కలొస్తే వోళ్ల దారోళ్లు జూసుకుంటారు" అనుకుంతా పిలకాయిల కాడికి పొయింది. పాలిచ్చి, ఊళ్లో కి బోయి ఎవురన్నా అంత కవళం పెడితే జాగర్తగా తెచ్చి బిడ్డలకి పెట్టేది. సుబ్బరంగా నీళ్లు గీళ్లు పోసి, జళ్లు గిళ్లూ యేసి బొమ్మల్ని జేసినట్టు జేసేది పిలకాయిల్ని.

*** **** ***

ఆడపిలకాయిలిదరూ వొయిసుకొచ్చినారు. పెద్ద పిల్లకి అమ్మంటే పాణం. చిన్నది రోoత జాణ. దానికి ఉగదెలిసిన కాణ్ణుంచీ కుక్క వోళ్ల అమ్మ అని తెలిసేతలికే చీదిరించుకుది. పెద్దపిల్ల మాత్రాం చిన్నదానికి బుద్ది జెపతావుండేది."ఒమే! మనవల్ని కనింది ఈ యమ్మే, చిన్నప్పుట్నించీ యెన్ని అగసాట్లుబడి మనవల్ని సాకిందో మనకి తెలవదా! అటువంటి అమ్మని కుక్కగానే జూస్తుండావే. అట్ట జూస్తే దేవుడు మనవల్ని మెచ్చతాడ!" అని చెప్పేది. ఇయ్యన్నీదాని చెవులికెక్కలా. యెప్పుడెప్పుదు దీనిపీడ పోద్యాని చూస్తావుండేది. ఒక రోజు ఈళ్లిద్దరూ పూలతోటకాడ పూలుకోస్తుంటె ఇద్దరు అన్నదమ్ముళ్లొచ్చినారు. ఇద్దర్నీ జూసినారు. ఇష్టపడి పెళ్లి జేసుకుంటావన్నారు. చిన్నది సరే నంది. పెద్దది మాయమ్మని అడిగి వస్తానంది. సరేనన్నారు. పలానా రోజొస్తావన్నారు. పెద్దపిల్ల ఇంటికొచ్చింది. యెనకనే చిన్నదొచ్చి" అక్కా! అమని గిమ్మని అడగతానంటావేందే పిచ్చిదానా! ఈ నల్ల కుక్కని అమ్మని వోళ్లకి చూపిస్తావా!" అని అక్కణ్ణుంచి యెల్లిపొయింది. నల్లకుక్క పెద్దపిల్ల కాడికొచ్చింది."బంగారు తల్లీ! మీకు రెక్కలొచ్చినాయి. ఇంక మీగూళ్లు మీరెతుక్కోవాల.నామాట కోసరం యెందుకు తల్లీ ఇంతదూరం వొచ్చినావు. చిన్నది చెప్పింది నిజివే నమ్మా! రేపు మిమ్మల్ని చేసుకోబొయ్యే వోళ్లు మీ యమ్మా నాయినా యెవురంటే నన్నెట్ట జూపిస్తారు. ఈ ముసిలి నల్లకుక్కని జూస్తే వోళ్లు మిమ్మల్ని చేసుకోరు. నామాటిని నువ్వెళ్లిపోమ్మా! పోయి సుకంగా బతుకు. నాకంతకనా ఇంకేంగావాలా" అంటే పెద్దది బోరున యేడిసింది అమ్మని పట్టుకోని. "ఇన్నిరోజులు కళ్లల్లో పెట్టుకోని సాకినావే ఇయ్యాల నాపెళ్లి కోసరవని నిన్నొదిలేసి పొమ్మంటావమ్మా!" అనింది. రోంచేపు ఇద్దరూ కరువుదీరా యేడ్చుకున్నారు. "లేమ్మా!లెయ్ నా తల్లివిగదా!" అని కళ్లు తుడిచింది. "నేనేడకి పోతానమ్మా! ఇక్కడే ఉoటా. యాడికీ పోను.నువు పెళ్లిచేసుకొని పదికాలాలు పిలాజెల్లల్తో సల్లంగా ఉందాల.నువ్వెప్పుడు గావాలంటే అప్పుడొచ్చి నన్ను చూసిపో.అంతేగద." అని చెప్పి పంపిచ్చింది.
**** ****** ******

అక్కా చెల్లుళ్లూ, అనాదమ్ముళ్లూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజు తాలినపాట చిన్నది ఒకనాడు పొద్దన్నే నల్లకుక్క ఉండే ఇంటిసాయొచ్చింది. అది ఇంకా నిదర బ్లేవలా పాపం. ఆదమరిస్ ఇనిదరబొయ్యేదాని మింద బొంతరాయెత్తి యేసింది. అంతే నిద్దట్లోనే అది గుక్కిరు మిక్కిరనకుండా సచ్చిపొయింది. సచ్చినబిందిని ఈద్సుకొనొపోయి తోటకాదా పారేసి దాని మానానది పొయింది. ఆయాల్నే దైబాత్తంగా పెద్దది తోటకాడికొచ్చింది. దార్లో సచ్చి పడున్న బొందిని జూసి కలవరపొయింది. యేందమ్మా ఈగోరవా అవి గుండిలు బాదుకోని యేడ్చింది. బొందిని తీసకపోయి ఇంట్లో గంపకింద కప్పెట్టింది. చిన్నదానికాడికి పోయి "అమ్మ సచ్చిపొయిందిమ్యా" అని యేద్చింది. "పోతే పోయిందిలే యెదవనా ముడియాలు. అది ఉణ్ణెన్ని రోజులూ నామొగుడేడ చూస్తాడో అని బయిపడి సచ్చినా. ఇయ్యాలిటితో దాని పీడ నేనే ల్యాకుండా జేసినా" అనింది. పెద్దపిల్ల అమ్మని చంపింది చిన్నదేనని తెలిసి, దాన్నింక యేవీ అన్లేక ఇంటీకొచ్చేసింది.
ఇంట్లో గంపకింద యేవుందో చూదావని పెదదాని మొగుడు గంపెత్తినాడు. పెద్దదాని కయితే పాణం పొయినంత పనయింది. యాడ మొగుడు ఆబొందిని జూస్తాఏవో నని. గంపదీసే తలికే యేవుందే కళ్లు చెదిరిపోతావుండాయి. గంపకింద ముత్యాలు, రత్నాలుతో జేసిన నగలు గంపడుండాయి. పెద్దదానికి పోబోతున్న పాణం తిరిగిచ్చింది. "యాణ్ణించొచ్చినాయిమే ఇన్ని నగలా" అడిగేడు మొగుడు. "మా పుట్టింటోళ్లు పంపిచ్చినార్లేవయ్యా" అని చెప్పింది."అట్టయితే పిలా! రేపు మంచిరోఝూ చూసి మీ వోళ్లని పిలువూ, నీకోసరం ఇన్ని నగలు పంపిచ్చినోళ్లకి మనింట్లో వోళ్లకి ఒక్క పూటన్నా కూడు పెట్టొద్దా"అన్నాడు.
ఓరిబగమంతుడా! ఒకటి తప్పిచ్చుకుందావని బొంకితే ఇంకోటి తగులుకుంది గదరా తండ్రీ! ఇప్పుడు నేనేం జెయ్యాల. తీసుకొనిరాకపోతే మొగుడు ఊరుకోడు. తీసుకొద్దావంటే అసలోళ్లు లేరు. ఇంక నాకెవురు దిక్కు" అనుకోని."ఇంక నేనేం చెయ్యలేను. ఊరవతల ఒక పుట్టుండాది. పోయిదాంట్లో చెయ్యిగాని పెడితినంటె ఆయినే నన్ను మాయమ్మకాడికి జేర్చుకుంటాడు" అనుకొని ఊరవతలికి పొయింది.
పుట్ట కాడికి పోయి చుట్టు తిరిగి దమ్ణం పెట్టూకోని పుట్టలో చెయ్యిపెట్టింది. యేడు సిరుసుల్తో నాగేంద్రుడు పుట్టబయిటి కొచ్చి, "ఏమ్మా! నీకొచ్చిన కష్టవేందో నాతో చెప్పు. నువ్వు నాకు ఆడపొడుచుతో సమానం. నీ తోడబుట్టినోడితో నీ బాద చెప్పు తల్లీ!" అన్నాడు. " అన్నా! మా ఆయిన, మీ పుట్టీంటోళ్లు మనింటికి ఒక్కతడవ గూడ రాలేదు. ఒక సారి తీసుకొనిరా అంటుండాడు. ఉన్న ఒక్క తల్లీ పోయింది. ఇంక నేనేంజేసేదో నువ్వే చెప్పు" అనింది."సరేమ్మా! రేపు శెనివారం రోజు సుబ్బరమణెం సావి కి పెట్టూకుందావని మీ ఆయినకి చెప్పు. మాయన్నదమ్ముళ్లం ఏడు మందివీ మీ ఇంటికి బోజినానికొస్తావు. ఇంక దిగుల్లేకుండ పొయిరామ్మా!" అని పంపిచ్చినాడు. అనుకున్నట్టూగానే ఆయాల పెద్దమ్మి ఇంటికి నాగేంద్రుడు ఏడుగురు అన్నదమ్ముళ్లుతో వొచ్చినాడు. వోళ్లకి కావాల్సినియ్యి వొండి వొద్దించినాది పద్దమ్మి. కడుపునిండ తిని చెల్లులుకీ, బావకీ పొయ్యొస్తావని చెప్పి, నాగలోకం నించి తెచ్చిన నాగమణిని చెల్లులుకిచ్చి పొయినారు.
పెద్దపిల్ల మొగుడు బావల్ని చూసి బలే కుసాలపడిపొయినాడు. పోయి తమ్ముడికి చెప్పినాడు. తమ్ముడు పోయి చిన్నదానికి మల్లుకున్నాడు. మీపుట్టింటొళ్లు మీయక్కకాడికి వొచ్చిపొయినారంటా, నీకాడికె యేవిటికని వొచ్చి పోలేదు అనడిగినాడు.
చిన్నది పోయి పెద్దదాన్ని అడిగితే అంతా ఇడమర్సి చెప్పింది పెద్దపిల్ల. చిన్నది నేంగూడా పొయ్యి పుట్ట లో చెయ్యి పెడితే నాఇంటికి గూడ వొస్తారు గావాలని పుట్టకాడికి పొయింది.పోవటం తోనే నేరుగా పుట్టలో చెయ్యి పెట్టింది. నాగెంద్రుడు ఒక్క కాతేసినాడు. ఆణ్ణే ఆపిల్ల నురుగులు కక్కుకోని సచ్చిపోయింది.
పెద్దపిల్ల చిన్నదిఫోయిందనీ యేడ్చింది. ఆయాల అమ్మని అట్ట చంపకుండా ఉంటె, ఈ అద్దాన్నపు సావు వొచ్చేది కాదు గదాని మనసులోనె అనుకొనింది.
ఆ పిల్ల మింద మనుసు సంపుకోలేక ఆ నల్లకుక్క మల్లా ఆడపిల్ల గా పెద్దపిల్ల కదుపునపుట్టింది.


*** *** ***

Tuesday, December 19, 2006

post for telugu

this post is for telugu people